![]() |
"అహో వీర్యం, అహో శౌర్యం,అహో బలపరాక్రమా !నారసింహమ్ పరందైవం అహోబిలం ఆహోబలం"ప్రహ్లాదవరదుడు ,శ్రీహరి నారసింహ రూపం లో కొలువైన పుణ్యక్షేత్రం అహోబిలం, ఇది ప్రహ్లాదుడికి మాత్రమే కాదు గరుడునికి,అన్నమయ్యకి దర్శనం ఇచ్చిన ధామం, 108 పుణ్య తిరుపతుల్లో అత్యంత ముఖ్యమైనది. హైదరాబాదు నుండి 380 కిలోమీటర్ల దూరంలో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం లోఉంది. అటు భక్తికి,ముక్తికి ప్రకృతి రమణీయతకు ఆలవాలం అహోబిలం...... పావన నరసింహ నుండి క్రోడ నరసింహ ఆలయం . సింహావలోకనం .......కాలం... ఎల్లలెరుగని ఒక అద్భుత సాగరం, ఒక్కసారి మనం ప్రయోజనం గా వాడుకోగలిగితే కలలో సైతం ఉహించని ప్రయాణాలలో యాత్రికులు గా మారుస్తుంది. తన నీడ లో , వెచ్చని వడి లో సేద తీరుస్తుంది. వానకురిసినా,మబ్బు మురిసినా హరివిల్లు విరిసినా మన కోసమే అనుకుంటాడు మన లోని పసి బాలుడు.. ప్రతీక్షణం ప్రశ్నిస్తూ పోయే ఆత్రేయ లాంటి వాడికి ప్రకృతి మేలైన బడి.మానవ జ్ఞానానికి తల్లి ప్రకృతి , తండ్రి కాలం ఐతే జిజ్ఞాస పలకా-బలపం లాంటిది..ప్రకృతి కాంతను మోహించటం, తన గాఢ పరిష్వంగం లో పరవశించి పోవటం అనే అదృష్టాన్ని మనకు జీవితం పౌరసత్వం గా అందించింది..ఈ విషయం లో కాలానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.నమ: కాలయ...శివుని తాండవానికి సంగీతం పుడితే నరసింహుని లాస్యానికి మేళ కర్త రాగాలు ఉద్భవించినవట.ఏది ఐతే నేమి జలపాతాల హోరు,కిలకిలారావాలు మనిషికి సంగీతం వినే అలవాటు చేసి ఉండవచ్చు. శమ దమాదులను మరిపించేసినది శ్రీ హరి సంకీర్తనమే అంటాడు అన్నమయ్య. హర్నామ సంకీర్తనతో మా ప్రయాణాన్ని మొదలు పెట్టాం.. మనదైన వ్యక్తిత్వాన్ని మనసు పొరలలో నుంచి తవ్వితీసేది సజ్జనసాంగత్యం మాత్రమే, ఒకరకంగా ఈ ప్రయాణం ఐహిక,ఆముష్మికం..పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండానే గురువారం రాత్రి గ. 10.00 కి హైదరాబాదు నుంచి బయలుదేరాం.సుందరానంద ప్రభు జీ అక్కడ ఏం చెయ్యాలో ఏం చెయ్య కూడదో చెప్పారు. బస్సు లో చాలా సామాన్యంగా కనిపించే విశిష్ట వ్యక్తులను కలిశాను. ప్రకృతి మనిషిని ఎదగనిస్తే, అణుకువ ఆ ఎదుగుదలని స్తిరీకరిస్తుంది. వైరాగ్యం ,సర్వసంగ పరిత్యాగం మాత్రమే యోగి లక్షణాలని నేను భావించను ,ప్రకృతి లో , కాలం తో లీనమై తానే కాలప్రకృతి గా అవ్వటమే యోగత్వం అని నాకు అనిపిస్తుంది. భారతీయతత్త్వం రెండు మార్గాలు అనుసరిస్తుంది ఒకటి నేనే అంటుంది ,మరొకటి నేను అనేది లేదంటుంది. కృష్ణుడు చెప్పింది మొదటిది (ఆత్మవత్ సర్వభూతేషు..) కాగా ,రెండోది శంకరుని మాయావాదం. దీన్లో అంతర్ముఖ భేదం లేక పోయినా భేదం మనకి తోస్తుంది. కృష్ణుడు ముందు జగద్గురు కాబట్టి ఏది ? నాదని వదులుకోవటం కన్నా అంతా నాదని తలవటం సానుకూల దృక్పధమేమో..!
ఉదయాన్నే6. 00 గo. కి కర్నూల్,నంద్యాల,ఆళ్లగడ్డ మీదు గా అహోబిలం చేరాం... ఆర్య వైశ్య సత్రం(మఠం పక్కన) లో బస . విపరీతంగా ఉన్న కోతులు ,కొన్నిసార్లు కోపాన్ని ,భయాన్ని ,నవ్వును తెప్పించాయి..మన ఉద్వేగాల తో ఆడుకొనేది కొన్ని సార్లు ప్రకృతి ఐతే..చాలా సార్లు మనిషే ! అందుకేనేమో కృష్ణుడు స్థితప్రజ్ఞత గురించి అంతలా నొక్కి చెప్పాడు. స్నానాదికలు పూర్తి చేసి, పక్క బడ్డీ కొట్టు లో దోశ తిన్నాం.
ఈ కుగ్రామం లో వీధులు,మండపాలు చూస్తే ఒకప్పుడు విస్తృత వ్యాపారం,ఉత్సవాలు తో కోలా హలం గా ఉండే దని తెలుస్తోంది. శ్రీ కృష్ణరాయల విజయస్తంభం, దానికున్న చిరు గంటలు మలయమారుతానికి చేస్తున్న సవ్వడి..గత కాలం మంచువోలే కరిగిందని చెప్పకనే చెబుతున్నాయి. దాని ఏకరీతి ఏకశిలా నిర్మాణం,కింద ఆంధ్ర-కన్నడ శాసనం..దాని కీర్తినీ,ఉత్కృష్టత ని తెలియ చేస్తే పారిశుధ్యలేమి, మన పాలకుల,ప్రజల అలసత్వాన్ని దెప్పి పొడుస్తున్నట్టు నాకు అనిపించింది.. బలిజ సత్రం లో ప్రభుపాద డా.సింగ్ పుట్టిన రోజు ఇస్కాన్ సంప్రదాయం లో జరిగాయి. డా.సింగ్ కెమిస్ట్రీ లో పి.హెచ్.డి చేసిన కాలిఫోర్నియా ప్రొఫెసర్.ఆయన జీవన ప్రయాణాన్ని కలకత్తా ప్రొఫెసర్ వివరించారు. పులగం ప్రసాదంగా గా పెట్టారు. శాస్త్రమైన,వేదాంతమైన అంతిమంగా సత్యావిష్కరణ ధ్యేయం గా ఉంటుంది. అటు గాంధీ ఐనా ఇటు ఫూలే ఐనా తమ మార్గాలని సత్యం తో ముడి పెట్టారు(సత్యం తో నా ప్రయోగాలూ గాని,సత్య శోధన. గాని.). జీవిత ప్రవాహఝరిలో కొన్నిసార్లు ఆ వడి కి సత్యం అర్థ హీనమైన వస్తువు గా గోచరిస్తుంది. కానీ జీవిత గతి కి కారణం ఆ సత్యం మాత్రమే అని విజ్ఞులు తెలుసుకొంటారు అంటాడు పాలోకొయిలో(ది అల్ కెమిస్ట్) .అంతకు ముందే దిగువ అహోబిల స్వామి గుడికి వెళ్ళాం. అత్యద్భుత శిల్ప సంపద తో అలరారుతోంది, ఎక్కడ చూసిన విజయనగర శిల్పి పని తనాన్ని పొగడక తప్పదు. (నగర స్టైల్ అఫ్ ఆర్కిటెక్చర్), గుడి ప్రధాన ద్వారం దగ్గర ఉండే ఆది వరాహo చాళుక్యుల కాలం నాటిది. పల్లవులు,చోళులు, చాళుక్యులు, కాకతీయ,రెడ్డి రాజులు, విజయ నగర...పరంపర కనిపిస్తుంది. ఉదయపు ప్రభాత సేవకి గోవులను తీసుకు వస్తారు. ప్రసాదం చాలా బాగుంది. అన్నమయ్య , ముస్లిం రాజులూ, పోర్చుగీసు యాత్రికులు శిల్పాలు కనబడుతాయి. యుద్ధసన్నద్ధ దృశ్యాలు, శృంగార భంగిమలు నాటి పనితనాన్ని చూపుతాయి. ముఖ ద్వారం దగ్గర దశావతార,కృష్ణ లీలలు చెక్కబడ్డాయి.
నరసింహస్వామి సేవకి తిరుమల రాయుడు దిగి వచ్చాడట. అందుకే ఇక్కడ కళ్యాణ వేoకటేశ్వర ఆలయం ఉంది. ప్రతాపరుద్రుడు ఇక్కడి అడిగోప శత యతీన్ద్రునకి బంగారు నృసింహ విగ్రహాన్ని ఇచ్చాడట. ఇప్పటికీ అది ఆ మఠం ఆధీనం లో ఉంది.
ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక సత్రాలు కట్టించ బడ్డాయి. చాలా సత్రాలు శిధిలావస్థలోనో,ఆక్రమణలోనో ఉన్నాయి. ఇక్కడ వివిధ కులాలకు వేరు వేరుగా సత్రాలు ఉన్నాయి. ఇన్నాళ తర్వాత వర్ణ వ్యవస్థ ను నేను బలంగా చూస్తున్నాను. భారత సమాజానికి అంటుకొన్న జాడ్యం లా,పెత్తందారి తనం ఎలా వచ్చి చేరిందో , చాతుర్వర్ణ్యం మయాసృష్టి..అనేది ఒకటే పట్టుకొని గుణకర్మ విభాహశ..అనే దాన్ని వదిలేశారు.
బేబీకార్న్ బజ్జీలు,దానిమ్మ,నిమ్మ,మొక్కజొన్నల సలాడ్ తో భోజనం.చాలా బాగుంది. భజన లోఅందరూ తన్మయత్వంతో ఆడి పాడుతున్నారు. బెంగళూరు అమ్మాయిలు చాలా సంప్రదాయం గా ఉన్నారు..
సాయంత్రం 4గo. కి భజన చేస్తూ భార్గవ నృసింహ ఆలయానికి బయలు దేరాం.
దిగువ ఆహోబిలానికి 2.5 కి.మీ దూరం లో భార్గవ నృసింహ ఉంది. దారిలో ఆవులు కృష్ణ భజన కో,జనాల కోలాహలానికో పరుగిడుతుంటే అటు గా.,గోధూళి రేగుతోంది. అoబారావాలు, కిలకిలలతో గ్రామీణ వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది. దారి లో డా.నరసింగరావు మంచి మిత్రుడు ఐయ్యారు. కొండ పైన అక్షయ తీర్థం ఉంది. దానిలో కలువలు బాగున్నాయి. పరశు రాముడు తపస్సు చేసి స్వామి ని మెప్పించాడట.చిన్న గుడి ,ప్రదక్షణ మండపం ఉంది.
అక్కడ మాతో పాటు వచ్చిన విజయవాడ బాచ్ చేరారు. ప్రత్యూష్ ఝా అనే నేపాలీ మిత్రుడు పరిచయం ఐయ్యాడుతను JNTU లో చదువు తున్నాడు. నేపాల్ రాజకీయసంక్షోభం, భౌగోళిక భిన్నత్వం,జాతుల మధ్య వైరుధ్యాలు తెలుసు కొన్నాను. తన మాతృ భాష మైథిలి ,సీతాజన్మ స్థానం జనక్ పురి రమ్మని ఆహ్వానించాడు. కొండ దిగే సరికి చీకటి పడింది.సత్రం లో భోజనం చేసి మరలా బస కి చేరాము.
శనివారం ఉదయం 6గo. కి అసలు ట్రెక్కింగ్ ప్రారంభం ఐoది. ఎగువ అహోబిలం దాకా బస్సు. ఘాట్రోడ్డు ప్రయాణం చాలా వేగంగా సాగింది. ఇది వర్షాధారిత సతత హరితారణ్యo. సూర్య కాంతి కొన్ని చోట్ల మాత్రమే చోచ్చుకొని వస్తోంది. ప్రపంచం లో ఎర్రచందనం పెరిగే అతి విశిష్ట ప్ర్రాంతం ఇది. ఎక్కడి నుంచో మత్తుగా అడివి పూల వాసనలు, మంచు బిందువుల మీదుగా మృదుత్వం తో కూడిన వెలుగు రేఖల ప్రతిదీప్తులు, ఆకాశాన్నంటే పర్వత శ్రేణి.. నాకు కాళిదాస,పెద్దన ద్వయాలను గుర్తుకు తెచ్చాయి. పార్వతి కాపు పెట్టిన సింహరాజాలు, గాని గంధపు చెట్లతో కండూతి తీరచుకొనే గజ రాజాలు కానీ కనబడలేదు..కానీ ఆ మహా కవుల పుణ్యమా అని ఆ భావన స్పురించింది. ఎఱ్ఱన విరచితమైన నృసింహశతకం ఇక్కడ ఆవిష్కారం ఐనదే.
బస్సు దిగిన వెంటనే పర్వత శ్రేణులు,లోయలతో అలరారు ప్రకృతి ప్రౌఢతనం,గాంభీర్యం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి.కొండ కింద ఒక నిర్మానుష్య ప్ర్రాంతం లో దీపాలతో ఒక అందమైన గుడి ఉంది.పక్కనేవున్న జలపాతం జపతపాలకు చాలా అనుకూలం గా,చాలా సౌందర్యాన్ని,ప్రశాంతాన్ని కలిగి ఉంది. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగితే అది భైరవ గుహ గా చెప్పాడు. ధైర్యం చేసి ఆ దీపపుకాంతిలో నే గుహ లోకి ప్రవేశించాను .అక్కడ ఒక వైష్ణవయాయువు ప్రతిమ ఉంది.చుట్టూ ప్రదక్షిణప్రాకారం ఉంది. మొత్తం మీద 7,8 శతాబ్దాల శైవ,వైష్ణవ ఆధిపత్యాలకు ఈ ప్ర్రాంతం ఆలవాలం ఐనది,ఆ సంఘర్షణ రక్త పాతo లీలగా గోచరిస్తుంది.జలపాతం నుండి వచ్చే నీళ్ళలో రాళ్ళు,చేపలు,పెద్ద కొండ సూర్యుడు కలిసి నా మనో చిత్ర పటానికి కొత్త రంగులద్దాయి
ఎగువ ఆహోబిలo గుడి వెనుక నుండి రెండు దార్లు ఉన్నాయి. ఒకటి పావన నృసింహ ఆలయానికి దారి తీస్తే మరొకటి క్రోడ,మాలోల,జ్వాలా నరసింహ లకు త్రోవ. భవనాశిని పేరుకు తగ్గట్టు ఒక జల ప్రవాహం, స్వచ్చం గా జాలువారే నదీ పాయ,
స్వచ్చతే పవిత్రతను ఆపాదిస్తుoదేమో! కొన్నిసార్లు వంతెనల మీద, మరికొన్ని సార్లు నీళ్ళలో,ఇంకొన్ని సార్లు నున్నని రాళ్ళ మీద మా ప్రయాణం సాగింది. దేవుల పల్లి ఆకులో ఆకునై..పువ్వులో పువ్వునై.... ఇచటనే ఆగిపోనా..అనిపించింది. దారిలో తెచుకొన్న జామకాయలు,కమలా ఫలాలు తిన్నాం. ఈ దారి లో సూర్య కాంతి పడి కొండలు కాంస్య కట్టడాలు గా మెరిసి పోతున్నాయి. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళి విహార లక్ష్మీ నారసింహ......... అనే అన్నమయ్య గుర్తు కొచ్చాడు. ఎతైన శిఖరాన్ని చూపుతూ పురుషోత్తం దాస ప్రభు జీ నృసింహుడు చీల్చిన ఉగ్ర స్తంభాన్ని చూపించారు. ఏడి నీ విష్ణువు అన్నపుడు ప్రహ్లాదుడు చూపినట్టు... ఇది భౌగోళిక అద్భుతమైనా అనంత మార్మికత కి చిహ్నమా! అని అనిపించింది.
..
ఈ వీడియో చూపింది ఆ శిఖరం పైనున్న నరసింహ..పాదాలు..భవనాశిని జన్మ స్థానం..దారిలో క్రోడ నరసింహాలయం దర్శించాo.భూమి ని ఎత్తిన కోరని క్రోడ అని పిలుస్తారుట. భూమిని తన భుజాలపై మోసే మూర్తి ని మనం చూస్తాం.. భావనశిని గుండా మరింత దూరం ఇరుకిన ప్రయాణం చేసాం. సరైన గైడ్ లేకుండా ఇక్కడ కు చేరటం చాలా కష్టం. ఇక్కడ మనం భావనాశిని తాండవాన్ని, హొరునూ మనం అనుభవం చెందవచ్చు. విష్ణు పాదోద్భవ గా చెప్పబడే ఆ చల్లని నీటిలో తడవటం తో నే, మన శ్రమంతా మర్చి పోవచ్చు. నిజానికి దైవికమయినా,మార్మిక మైన, భౌతికమైనా ఈ అపార జలరాశి , జీవ రాశి ఉద్ధరణకు పారు గిడటం, ప్రాణి గా దాని ప్రాపకం పొందటం అదృష్టం అనే చెప్పాలి. ఈ ధారలలో తడవనిదే జ్వాలా నృసిమ్హుని చేరలేము. ఇక్కడ నృసింహుడుఉగ్ర మూర్తి, వచ్చినవాడు విష్ణువే అని చెప్పే శుక్రా చార్య విగ్రహం,నృసిమ్హుని శాంతింపజేసే దేవతా ప్రతిమలు ఉన్నాయి. పది చేతులతో భయంకరమైన కవళికల తో క్రోధ మూర్తి గా స్తంభాన్ని చీల్చుకొని వస్తాడు మరో మూర్తి. మార్గళి మాసం కావటం తో తమిళ భక్తులు కూడా ఇక్కడ ఎక్కువ గా ఉన్నారు. తమిళులు ఈ ప్రాంతాన్ని సింగ వెల్ కొండ్రo గా పిలుస్తారు.. మరో వైపు చెంచులు తమ మత విశ్వాసాలతో స్వామిని కొలుస్తారు. హైందవ మతం పంచములుగా వారిని చీదరించు కొంటే వారే ఆ దైవాన్ని ఆదరించటం వారి మైల పడని మనస్తత్వానికి గీటురాయి.
ఈ ప్రధాన మూర్తి కి ఎదురు గా గరుడాద్రి, వేదాద్రి అనే రెండు పర్వతాలను భవనాశిని చీల్చి అద్భుత మైన లోయను సృష్టించింది.. ఈ మూర్తి ఉండే కొండ భాగానికి అచలాచల మేరువు అని పేరు... భావనాశిని నీటి తుంపరలు, చల్లని తుషారాల ఫై సూర్య కాంతి పడి ఇంద్ర ధనుస్సులు ప్రతి చోటా గోచరిస్తాయి. చెట్లఫై వాలే పావురాలు గా కొండలపై మేఘాలు సేద తీరుతుంటాయి. ఈ నీటి లో తడుస్తూ ,ప్రకృతిని ఆస్వాదించటం నిజంగా ఒక అపురూపమైన అనుభవం. అన్నమయ్య పాటల్లో శమ దమాదుల మరిపించేది శ్రీ హరి సంకీర్తనం అంటాడు. సర్వం వ్యాపించిన వాడు, విష్ణుపదానికి కున్న వ్యుత్పత్తి ఇది..
కొండ దిగుతూ లక్ష్మీ పర్వతం ఫై ఉన్న మాలోల నరసింహుని దర్శించుకున్నాం.మా లోల అంటే లక్ష్మి తో క్రీడిoన్చే స్వామి అని అర్థం. స్వామి ఇక్కడ లక్ష్మి పైట వదలడట. బయట విగ్రహాలు కొన్ని విరిగి పోయి ఉన్నాయి. ఎదురు గా కాలభైరవ మూర్తి, ఒక స్త్రీ ప్రతిమ, పాద ముద్రలు వున్నాయి. ఇది నరసింహుడు చెంచు లక్ష్మి తో ప్రణయం ఆడిన చోటు, విగ్రహం బాగుంది అలంకారం బాగా చేశారు. ఈ స్వామికి మఠం ఆళ్వారులు కైంకర్యం చేస్తారు. ప్రతీ చోట మూల మూర్తి(ధ్రువ బేరం) తో పాటు అర్చా మూర్తులున్నాయి. దండయాత్రల వల్లనో, గుప్త నిదుల వల్లనో, ఈ మూర్తులు స్థానభ్రంశము చెందాయట.
ఇక్కడ నుండి సుమారు 2కి.మీ దూరo లో ప్రహ్లాదుడు చదివిన బడి ఒకటి ఉంది.ఆ ప్రయాణ మార్గం లో చాలా ప్రశ్నలను పురుషోత్తం దాస్ ప్రభు ముందుంచాను. 1. శ్రీకృష్ణుడు భక్తుని, జ్ఞాని ని యోగులు గాను, కర్మిష్టి ని యోగేశ్వరుని గా, అన్నా మనం భక్తి యోగానికి నికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తాం? 2. నవ విధ భక్తుల్లో దాస్యం కన్నా సఖ్యం,ఆత్మ నివేదనం గొప్పవి కాదా? 2. ఆచారః ప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః అన్న విష్ణు సహస్రనామం లో ధర్మం యుగధర్మమా? లేక భగవదారాధనా? ఆయన సమాధానాలు చెప్పే తీరు నన్ను ఆకర్షించింది. అప్పటి వరకు ఎక్కిన కొండల దారులను చూస్తే మరింత అందం గా ,అక్కడక్కడ గోపురాలతో సృష్టికర్త చేతి కుంచె ఎన్ని మెలికలు తిరిగిందో చూస్తే ఆశ్చర్యం అనిపించింది.
ఇప్పటివరకు కొండ ప్రాంతం కాస్తా సమతల భూభాగం గా మారింది. ఇక్కడ ప్రహ్లాదునికి శ్రీ మహావిష్ణువు వేదాలను భోధించి నాడట..వాటిని ఈ నేల ఫై అభ్యసించాడట. అందుకే నేలంతా వివిధరకాల గుర్తులతో(o,C,8.) ఉంది. ఇక్కడికి రావాలంటే చెప్పులు విడిచి రావాలి. అక్కడికి చేరే క్రమం లో కొండ వాగులు మన పాదాలను కడిగేస్తాయి. తడి పాదాలతో ఈ పొడి నెల ఫై అడుగు పెట్టిన వెంటనే విచిత్రమైన ముద్రలు కనబడతాయి. ఇక్కడ కొంత సేపు ధ్యానం చేశాం. జల పాతం హోరు, అక్కడి రాళ్ళ ఫై చేసే ధ్వని మనని మరో ప్రపంచం లో కి తీసుకొని పోతుంది.ఐతే జియాలజి పరం గా ఇది గోండ్వానా ప్రాంతం హిమాలయాలు కంటే పురాతనం.ఈ ఎగ్నీషౌస్ శిలలు,సెడిమెంటరి శిలల లో జురాసిక్ కాలం లో జీవించిన నత్తల శిలాజ ముద్రలు కావటానికి ఆస్కారం ఉంది.
ఈ ప్రాంతం లోనే ప్రహ్లాదునికి రాజనీతి, యోగ శాస్త్రం చెప్పినట్టు ఉండే గుహ ఒకటి ఉంది. హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని తోసి వేయగా.. ఈ గుహ లో నే పడినట్టు ఐతిహ్యం.ఇక్కడ ప్రధాన దైవం యోగ నరసింహుడు..పూజారులు ఇoత దూరం వచ్చి పూజలు చేస్తున్నారు. ఈ క్షేత్రం దేవాదాయశాఖ పరిధి లోలేదు, మఠం ఆధీనం లో ఉంది.బహుశా ఈ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ మరియు ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి లో ఉండటమేమో.
క్రమంగా కొండ కిందకి వచ్చాం.మధ్యాహ్నం భోజనం చేసి 4 గo. లకు యోగానంద, ఛత్రవట నరసింహ మందిరాలకు వెళ్ళాం. ఇక్కడ కాశినాయన ధర్మ సత్రం ఉంది . ఇక మా యాత్ర ఒక రోజే ఉండటం తో అందరిని పరిచయం చేస్కోన్నాo... రామాయణం మహాభారతా పాత్రలతో ఆటలు చాలా సరదాగా సాగాయి.
ఆదివారం ఉదయం 6.గ కి పావన నృసింహ దేవాలయాని కి ప్రయాణం. మొత్తం యాత్ర లో క్లిష్టమైనది కానీ మిత్రులు ముని కృష్ణ గారి మాటల ప్రభావమేమో తేలిక గానే ఎక్కేశాం. దారి లో శిరీష కుసుమాలు ,రక్త చందనాలు ఆహ్లాదాన్ని పంచాయి. ప్రకృతి కుండే గొప్ప లక్షణం పంచటం అనే స్టీఫెన్ కోవే గుర్తుకొచ్చారు. ముని కృష్ణ గారి దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకొన్నా. అప్పుడు అనిపించింది జ్ఞానo,ప్రేమ అనీ ఖడ్గాలు జయించలేని ప్రపంచం లేదని..క్రీస్తు, బుద్ధుడు...చరిత్ర లో అలాగే ఉదాహరణలు గా మిగిలి పోయారని..
మొత్తం మీద ఈ అహోబిల యాత్ర నాకు మంచి అనుభవాలను,వ్యక్తులను పరిచయం చేసింది. IISC,banglore,IIT,K, ఉస్మానియా మిత్రులకు,భక్తి వేదాంతా,హైదరాబాదు వారికీ, ముఖ్యం గా నా నేస్తాలు, డా.రాజేష్, వీరేoద్ర ల కు, చిత్రాలు సహకరించిన డా. నరసింగరావులకు, ముని కృష్ణ గారికి ( ఫాంట్ తప్పులు రాకుండా చాలా ప్రయత్నించాను.. ఇంకా చాలా తప్పులున్నాయ్, చదువరులు అన్నింటిని మన్నించి చదివి నందుకు )సర్వదా కృతజ్ఞుడి ని.....
- ఆత్రేయ
|
17, డిసెంబర్ 2014, బుధవారం
లేబుళ్లు:
అహోబిల యాత్ర
స్థానం:
Southern Asia
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)









